అమరావతి 'ప్రజావేదిక'ను మాకే ఇవ్వండి!: సీఎస్ ను కోరిన వైసీపీ

అమరావతి ‘ప్రజావేదిక’ను మాకే ఇవ్వండి!: సీఎస్ ను కోరిన వైసీపీ

ప్రజావేదికను తమకు కేటాయించాలని తొలుత కోరిన టీడీపీ
కాదు.. తమకే కేటాయించాలంటున్న వైసీపీ
ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్ర ఆసక్తి
అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజావేదికను తమకే కేటాయించాలంటూ టీడీపీ, వైసీపీలు కోరుతున్నాయి. ప్రజావేదికను తమకు కేటాయిస్తే అధికారిక కార్యకలాపాల కోసం వినియోగించుకుంటామంటూ చంద్రబాబు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. చంద్రబాబు లేఖ రాసిన వెంటనే వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఎంటరయ్యారు.

పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు ప్రజావేదికను తమకే కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని కోరారు. దీనిని తమకు కేటాయిస్తే పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం అనువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ నిర్వహించే సమావేశాలకు జగన్ పార్టీ అధ్యక్షుడి హోదాలో హాజరవుతారని, ఆయన భద్రతకు, ట్రాఫిక్‌కు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన వివరించారు.

కాబట్టి ప్రజావేదికను తమకే కేటాయించాలని సీఎస్ ను కోరారు. ప్రజావేదికను తమకంటే తమకు కేటాయించాలంటూ ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ కోరుతుండడంతో సీఎస్ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *