అనిల్ అంబానీ ఇంట్లో తప్ప ఎక్కడైనా నేను సిద్ధమే.. 10 నిమిషాలు చర్చిద్దాం: మోదీకి రాహుల్ తాజా సవాల్

అనిల్ అంబానీ ఇంట్లో తప్ప ఎక్కడైనా నేను సిద్ధమే.. 10 నిమిషాలు చర్చిద్దాం: మోదీకి రాహుల్ తాజా సవాల్

అత్యంత కీలక సమస్యలైన ఉద్యోగాలు, వ్యవసాయం, దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చకు రావాలంటూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి సవాల్ విసిరారు. మోదీకి పరిజ్ఞానం లేదని, అందుబాటులో ఉన్న నిపుణుల సలహాలను కూడా తీసుకోరని ఆయన ఎద్దేవా చేశారు. బహిరంగ చర్చకు రావాలని మోదీని ఎన్నోసార్లు కోరానని… ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని అన్నారు. తనతో 10 నిమిషాలు చర్చిస్తే చాలని, అయితే ఆయన మిత్రుడు అనిల్ అంబానీ ఇంట్లో తప్ప ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమేనని చెప్పారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ఈ మేరకు సవాల్ విసిరారు.

రాత్రికి రాత్రి చేసిన నోట్ల రద్దుతో పేదల జీవితాలతో మోదీ ఆడుకున్నారని రాహుల్ మండిపడ్డారు. తాము హామీ ఇచ్చిన న్యాయ్ పథకంతో దేశ ఆర్థిక స్థితి పుంజుకుంటుందని చెప్పారు. పేదలకు డబ్బు అందితే వారు దాన్ని మార్కెట్లో ఖర్చు చేస్తారని… దీంతో మార్కెట్లు తమ ఉత్పత్తులను మరింత పెంచుతాయని… ఈ రకంగా దేశ ఆర్థిక స్థితి బలపడుతుందని తెలిపారు.

1999లో పాక్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ ను బీజేపీ విడుదల చేసిందని రాహుల్ మండిపడ్డారు. ‘మసూద్ ను పాకిస్థాన్ కు పంపింది ఎవరు? కాంగ్రెస్ పంపిందా? టెర్రరిస్టులతో చర్చలు జరిపింది ఎవరు? అసలు వాస్తవం ఏమిటంటే… ఉగ్రవాదులతో బీజేపీ రాజీ పడింది’ అని అన్నారు.

ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని… మోదీ కంటే ఎక్కువ కఠినంగా తాము వ్యవహరించామని రాహుల్ తెలిపారు. ఒక వ్యూహం ప్రకారం తాము ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నామని… మోదీ మాత్రం ఒక ఈవెంట్ ను నిర్వహించినట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో సర్జికల్ దాడులు వీడియో గేమ్స్ వంటివని వ్యాఖ్యానించడం ద్వారా సైన్యాన్ని మోదీ అవమానించారని అన్నారు. సైన్యాన్ని తాము రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోమని చెప్పారు. సైన్యం అంటే మోదీ వ్యక్తిగత ఆస్తి కాదని చెప్పారు.

జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 1999లో మసూద్ అజార్ ను భారత్ విడుదల చేసింది. ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు… దాన్ని ఆఫ్ఘనిస్థాన్ లోని కాందహార్ కు తీసుకెళ్లారు. విమానంలో ఉన్న ప్రయాణికులను రక్షించుకునేందుకు మసూద్ అజార్ తో సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను అప్పటి భారత ప్రభుత్వం విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *